ఇద్దరికీ రెండేళ్ల క్రితం వివాహమైంది. ఒకరినొకరు అత్యంత ప్రేమించుకునే వారు. వీరిద్దరి కుటుంబాలు పోలీస్ శాఖలోనే ఉన్నాయి. పెళ్లయి రెండేళ్లు గడచినా పిల్లలు లేకపోవడం, ఇరుగు పొరుగు వారి గుసగుసలు, ఎత్తులు, తిట్లాటలు ఆ దాంపత్య జీవితం లో చిచ్చు రేపాయి. ఇరుగుపొరుగు వారి మాటలకు కలత చెందిన ఆమె ఆత్మహత్య చేసుకుంది. అతి కొద్ది సమయంలోనే భర్త కూడా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచాడు. ఈ విషాద సంఘటన మహబూబ్ నగర్ పట్టణంలో జరిగింది.
మహబూబ్ నగర్‌లోని పాత పాలమూరు ప్రాంతానికి చెందిన రవి, ఎస్పీ కార్యాలయంలో ఫింగర్ ప్రింట్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. రవి తండ్రి హెడ్ కానిస్టేబుల్. అదే పట్టణానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు కూతురు రజితతో రవికి రెండేళ్ల కిందట వివాహమైంది.
బీటెక్ చదివిన రజిత, తన జీవితంలో స్థిరపడిన తర్వాత పిల్లల్ని కనాలని అనుకుంది. కానీ, ఇరుగుపొరుగు వారి, బంధువుల వ్యాఖ్యలు, పిల్లలు లేకపోవడం గురించి చేసే వ్యాఖ్యలు రజితను తీవ్రంగా బాధించాయి. ఈ కారణంగా, రజిత గురువారం (మార్చి 22) ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అదే రోజు సాయంత్రం రజిత అంత్యక్రియలు నిర్వహించారు. భార్య మరణం వల్ల ఎంతో బాధలో ఉన్న రవి, ఆమెకు తలకొరివి పెట్టి ఇంటికి వచ్చి, రాత్రంతా ఏడుస్తూ సోదరుడితో కలిసి నిద్రపోయాడు. సోదరుడు నిద్రపోతున్న సమయంలో, శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో రవి కూడా ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కూతురు, కొడుకును కోల్పోయిన ఆ రెండు కుటుంబాలు కన్నీటి పర్యంతమవుతున్నాయి.