పులి ని చూస్తే పెద్ద పెద్ద వీరులే పరుగు లంకించుకుంటారు... కానీ ఓ ఏడేళ్ళ పిల్లాడు మాత్రం ఏకంగా పులినే ఎదిరించి పులికి చుక్కలు చూపించి తన స్నేహితుడ్ని లాక్కెళ్లున్న పులికి ఎదురు నిలబడ్డాడు...ఆపదలో ఉన్న తన స్నేహితుడిని కాపాడుకున్నాడు... చిన్న వయసులోనే పేద్ద సాహసం చేసి ‘అవసరంలో ఉన్నప్పుడు ఆదుకున్నవాడే నిజమైన మిత్రుడు’అన్న మాటను నిజం చేశాడు...అది గుజరాత్‌లోని అరాతియా అనే చిన్న వూరు. అక్కడేమో జైరాజ్ గోయల్, నీలేష్ అనే ఇద్దరు చిన్నారులున్నారు. వాళ్లిద్దరూ మంచి స్నేహితులు. ఈ మధ్య ఓ రోజు ఇంటి బయట సరదాగా ఆడుకుంటున్నారు. వాళ్లలా ఆటల్లో మునిగి ఉండగా ఓ పెద్ద అపాయం చిరుత పులి రూపంలో వచ్చింది. ఉన్నట్టుండి అది పొదల చాటునుంచి వీళ్ల వైపుకు దూకింది. అది గమనించుకునేలోపే నీలేష్‌ని పట్టుకుని జరజరా లాక్కుని వెళ్లే ప్రయత్నం చేసిందది.
దీంతో పక్కనే ఉన్న ఏడేళ్ల జైరాజ్‌కి కాళ్లూ చేతులూ ఆడలేదు. అలాగని ఆ పులిని చూసి పారిపోలేదు. ఫ్రెండ్‌ని కాపాడాలని దానిపై రాళ్లు విసరడం మొదలు పెట్టాడు. ఎంతకీ పులి మిత్రుడిని వదలడం లేదు.. పులి పులి అంటూ అరుస్తూ… తన చేతిలో ఉన్న పెద్ద పెద్ద శబ్దాలు చేసే ఎలక్ట్రానిక్ ఆట బొమ్మని గట్టిగా దానిపై విసిరాడు. ఆ ఎలక్ట్రానిక్ బొమ్మ శబ్దాలు విచిత్రంగా ఉండటంతో పులి బెదిరిపోయింది.
నీలేష్‌ని విడిచిపెట్టి అక్కడి నుంచి పరుగు తీసింది. ప్రాణాపాయం తప్పినందుకు హమ్మయ్యా అని చిన్నారులిద్దరూ వూపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన గురించి తెలిసి వూరు వూరంతా జైరాజ్ సహాసాన్ని మెచ్చుకున్నారు. ఈ అబ్బాయి ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తితో స్పందించిన తీరు చూసి జైరాజ్ టీచర్లతో పాటు అక్కడి అటవీ శాఖ అధికారులు కూడా ముచ్చటపడిపోయారు..